కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని చెప్పారు. ‘‘భారత రాష్ట్ర సమితి నేతల మాటలు మితిమీరి పోయాయి. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. జనాల్లోకి వెళ్లడం లేదు. రూ. రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది మా ప్రభుత్వ విధాన నిర్ణయం. రేషన్‌కార్డు ఆధారంగానే రుణమాఫీ చేశాం. సన్నం బియ్యం సక్సెస్ అయ్యింది. గతంలా పక్కదారి పట్టడం లేదు. ఉచిత బస్సుకు మహిళల నుంచి మంచి స్పందన ఉంది. మరో 3వేల బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.” అని భట్టి విక్రమార్క అన్నారు. ఫోర్త్ సిటీ పనులు, మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతాయని భట్టీ వెల్లడించారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం లేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం నిజమే: మంత్రి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీల నోటి వద్ద ముద్ద లాక్కోవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. భాజపా బలహీన వర్గాలకు వ్యతిరేకమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి 42శాతం రిజర్వేషన్ల వరకు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఎవరూ అడ్డుపడొద్దు’’అని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.
బీసీ బిల్లు ఆమోదం జాగృతి విజయం: కవిత
బీసీ బిల్లు ఆమోదం జాగృతి సాధించిన విజయం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్డినెన్స్ ప్రకటించి, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం పొందకుండా ఉంటే జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తాం. ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు. బీసీ బిల్లును అమలు చేయకపోతే రాష్ట్రం మొత్తం పర్యటించి జాగృతి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తాం’ అని కవిత హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని మేం భావిస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. అని కవిత వెల్లడించారు. రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయ హ క్కులు లభిస్తాయని కవిత వెల్లడించారు.