BATTI: సింగరేణి ఉద్యోగుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే కుట్ర

గత డాక్యూమెంట్ల ఆధారంగానే టెండర్లు అని స్పష్టం చేసిన భట్టి

Update: 2026-01-24 08:00 GMT

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థపై జరుగుతున్న ప్రచారాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సింగరేణి గురించి కావాలని కట్టుకథలు, ఊహాగానాలతో కథనాలు రాస్తూ 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, సుమారు 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి తెలంగాణకు ఆత్మ లాంటిదని, అలాంటి సంస్థపై జరుగుతున్న దుష్ప్రచారం ఆందోళన కలిగిస్తోందని స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పెట్టుబడుల పేరుతో ఒక పత్రిక ప్రచురించిన విషపు కథనంతో ఈ వివాదం మొదలైందన్నారు. వాస్తవాలకు దూరంగా, ఆధారాలు లేని ఆరోపణలతో రోజుకో కొత్త కథను అల్లుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కథనాల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో, ఎవరి కోసం ఈ రాతలు వస్తున్నాయో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి ప్రతిష్ఠను దిగజార్చేలా కావాలని ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.

సింగరేణిలో ‘సైట్ విజిట్’ అనే నిబంధన పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందని ఊహించుకుని కొందరు కథనాలు రాయడం దురదృష్టకరమని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అనుకున్న వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే నిబంధనలు మార్చారని, ప్రత్యేకంగా కొందరికే టెండర్లు ఇచ్చేందుకే సైట్ విజిట్ పెట్టారని పక్కా కథలు అల్లారని విమర్శించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి అనేది ఒక అటానమస్, ఇండిపెండెంట్ సంస్థ అని గుర్తు చేశారు. గత 105 ఏళ్లుగా సింగరేణి బోర్డు వ్యవస్థ కొనసాగుతోందని, అక్కడ తీసుకునే నిర్ణయాలు సాధారణంగా మంత్రుల వద్దకు కూడా రావని తెలిపారు. అయినప్పటికీ, ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజల్లో అపోహలు రాకుండా ఉండేందుకు నైనీ కోల్ బ్లాక్‌కు సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని తాను ఆదేశించినట్లు వెల్లడించారు. పారదర్శకతపై ఎలాంటి సందేహాలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

సైట్ విజిట్ నిబంధనపై దుష్ప్రచారం

సింగరేణి టెండర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు లేఖ రాయడం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించడం మంచి పరిణామమేనని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై కేంద్రం చేపట్టే ఎలాంటి విచారణకైనా తాము పూర్తిగా సహకరిస్తామని, కిషన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సైట్ విజిట్ అనేది దేశంలో ఎక్కడా లేని నిబంధన అన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. కోల్ ఇండియా సంస్థ 2018లోనే టెండర్ డాక్యుమెంట్లను పంపిందని, అందులో సైట్ విజిట్ తప్పనిసరి అని స్పష్టంగా ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన CMPDI డాక్యుమెంట్లను మీడియా ప్రతినిధులకు చూపించారు. అలాగే 2021లో కూడా కోల్ ఇండియా మరో డాక్యుమెంట్ పంపిందని, ఆ సమయంలో తమ ప్రభుత్వం అధికారంలో కూడా లేదని గుర్తు చేశారు.

Tags:    

Similar News