BC BANDH: బీసీ బంద్‌లో గళమెత్తిన అఖిలపక్ష నేతలు
బంద్‌కు మద్దతుగా అధికార పార్టీ ధర్నా... పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. రిజర్వేషన్‌కు మద్దతుగా విపక్షాల ఆందోళన
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. బంద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ,వాకాటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. బీసీ జేఏసీ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు తెలిపింది. ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మానవహారంలో పాల్గొన్నారు. బీజేపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొన్నారు.
బంద్ చేయని దుకాణాలపై దాడులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతమైంది. హైదరాబాద్‌లోని నల్లకుంట పరిధిలో బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్‌ను బేఖాతరు చేయకుండా తెరిచి ఉన్న బజాజ్ షో రూంతో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై ఆందోళనకారులు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ విసిరారు. దీంతో షోరూం అద్దాలు ధ్వంసమై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదేవిధంగా తెరిచి ఉంచిన పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోట్రోల్ కొట్టే ఫ్యూయల్ మెషిన్లను వారు ధ్వంసం చేశారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీసీ బంద్‌లో పాల్గొన్న మంత్రులు, అఖిలపక్ష నాయకులు. మంత్రులు కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, తుమ్మల శ్రీనివాస్ సహా పలువురు మంత్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు కూడా బీసీ బంద్‌కు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు.
రాజకీయాల్లోకి కవిత కొడుకు..!
42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు నిర్వహించిన బంద్‌లో తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో.. కవిత కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.