BC BANDH: తెలంగాణ బీసీ బంద్.. సంపూర్ణం.. విజయవంతం
బీసీ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన పార్టీలు, నేతలు.. అన్ని జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు.. మెడికల్ షాపులు మినహా అన్ని మూసివేత
తెలంగాణలో బీసీ బంద్ చెదురుముదురు ఉద్రిక్తతల మినహా ప్రశాంతంగా ముగిసింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే బంద్ మొదలైంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపునకు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ స్పందించారు. బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు నేతలు అడ్డుకున్నారు. తమ బంద్‌కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరారు. రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు మూతపడ్డాయి.
హైదరాబాద్‌లో..
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్‌లో బంద్ ప్రభావం కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ డిపోల్లో నుంచి బస్సులు కదలట్లేదు. దీంతో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు మద్దతుగా సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు సహకరించాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో బస్సులు నిచిపోయాయి. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నిరసన తెలిపాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ కొనసాగింది. బస్సు డిపో ముందు బైఠాయించి అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాపంగా తెలంగాణ ప్రభావం కనిపించింది.. రాష్ట్రంలోనే రెండో పెద్ద బస్టాండ్ ఉన్నటువంటి కరీంనగర్ పట్టణంలో డిపోలకే బస్సులు పరిమితం అయ్యాయి. అటు స్కూళ్లు కూడా బంద్‌కు సహకరించాయి. ఖమ్మం జిల్లాలో బంద్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అటు బందుకు వ్యాపార వాణిజ్య సంఘాలు మద్దతు తెలిపాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంద్ పాటించారు. మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో బంద్ చేపట్టారు. ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేటలో విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.
కిందపడ్డ వీహెచ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బంద్‌కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుతో సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ఫ్లెక్సీ పట్టుకుని ముందు నడుస్తున్న వి. హనుమంతరావు బ్యానర్ తట్టుకుని ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. వెంటనే నాయకులు ఆయనను పైకి లేపి సపర్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతమైంది. యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు.
భావోద్వేగానికి గురైన వీహెచ్
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంత రావు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల (బీసీ) హక్కులు, రిజర్వేషన్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ఎస్టీ, ఎస్టీ, బీసీ వర్గాల కష్టాలను, సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారని వీ హెచ్. పేర్కొన్నారు. ఇది ఈ వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన బీసీ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని, దీని ద్వారా వెనుకబడిన తరగతుల హక్కుల పట్ల సమాజంలో ఉన్న మద్దతు స్పష్టమైందని తెలిపారు. బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలని వి. హెచ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గట్టిగా డిమాండ్ చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానిగా మోదీ, బీసీలకు తప్పనిసరిగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించపోతే.. భవిష్యత్తులో రిజర్వేషన్లు సాధించుకోవడం కష్టమవుతుందని వి. హెచ్. హెచ్చరించారు. బీసీల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబట్టారు.