తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించంది. అయితే, ఈ బిల్లులు నాలుగు నెలలుగా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిని ఆమోదించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మూడు రోజులపాటు ధర్నా చేసింది. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయితే బిల్లును కేంద్రం చేతిలో పెట్టేసి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్లను ఆర్డినెన్స్ తీసుకువచ్చినా గవర్నర్ ఆమోదం ఇంతవరకూ పొందలేదు. దీంతో రిజర్వేషన్ల అమలు కష్టమనే చర్చ సాగుతోంది. అయితే చివరికి పార్టీ తరఫున అయినా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే యోచనలో ఉంది.
ఢిల్లీలో ఆందోళన చేసినా...
రేవంత్ రెడ్డి ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మూడు రోజులపాటు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ఈ కులగణన మోడల్‌ను ప్రశంసించినట్లు రేవంత్ తెలిపారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అపాయింట్మెంట్ రాకపోవడంపై రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఒత్తిడి కారణమని ఆయన ఆరోపించారు. “బీసీలకు న్యాయం చేయకపోతే, మోదీని గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం” అని రేవంత్ సవాల్ విసిరారు. మరోపక్క 2018లో అప్పటి సర్కార్ రిజర్వేషన్ల విషయంలో చేసిన క్యాప్ ను తీసేందుకు ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ కూడా ఆమోదం కాలేదు. దాంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ ఎంపీలతో పాటూ, ఇండియా కూటమి ఎంపీల మద్దతు కూడగట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా ముగిసాక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. కానీ రాష్ట్రపతి అపాయంట్మెంట్ ఇవ్వలేదు.. దాంతో మోడీ సర్కార్ బీసి రిజర్వేషన్లు అమలుకు అడ్డం పడుతుందని ఆరోపించారు. ఇక ఢీల్లీ వదిలి రాష్ట్రంలోనే ఏం చెయ్యాలనే దానిపై డిసైడ్ చేస్తామని రేవంత్ ప్రకటించారు.
ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్ దృష్టి
రిజర్వేషన్ల కోసం కేంద్రంపై చేసిన ఒత్తడితో ఎటువంటి ఫలితం రాకపోవడంతో ఇక ఏం చెయ్యాలనే దానిపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించనున్నారు. మరోపక్క బీసి రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయి నుంచి ఆందోళనలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ రాజకీయ సలహా కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి జీఓ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తోంది. దీనివల్ల ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తరఫున 42 శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం దిల్లీలో తనను కలిసిన వారితో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశంపై ఆలోచిస్తామన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అలా చేస్తే, మిగిలిన పార్టీలు కూడా ఇవ్వక తప్పదని, అయితే చివరి వరకు కేంద్రంపై ఒత్తిడి చేయాలనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చిలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపారు. గత నెలలో మంత్రివర్గం ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్‌కు పంపగా... దాన్నీ రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై సర్కారు దృష్టి సారించింది. మొత్తానికి బీసి రిజర్వేషన్ల విషయంలో పడిన పుల్ స్టాప్ ను తొలగించేందుకు ఎటువంటి అడుగులు పడుతాయో చూడాలి.