మాజీ మంత్రి అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారా లేక అరెస్ట్ చేశారా అన్నది తేలాల్సి ఉంది.;
బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని లోధా డెవలపర్స్‌లో ఉంటున్న అఖిలప్రియను.. నార్త్ జోన్ పోలీసులు ప్రశ్నించారు. అఖిలప్రియ ఉంటున్న లోధా డెవలపర్స్‌కు ఉదయం పదిన్నరకు వచ్చిన పోలీసులు.. దాదాపు గంట గంటన్నర సేపు అఖిలప్రియతో మాట్లాడారు. అనంతరం అఖిలప్రియ సొంత వాహనంలోనే బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
హఫీజ్‌పేట భూముల విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదం భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి భూమా అఖిలప్రియ, భర్త భార్గవ్‌రామ్ కూడా తలదూర్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు అందిన ఫిర్యాదులో కూడా అఖిలప్రియ పేరు ఉండడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అఖిలప్రియ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.
కిడ్నాప్ వ్యవహారం వెనక అఖిలప్రియనే ఉన్నారని బాధితులు చెబుతున్నారు. కిడ్నాప్ చేయడానికి వచ్చిన నిందితులు ఆళ్లగడ్డ నుంచి వచ్చారని, వాళ్లే ఈ ఆపరేషన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన వాహనాలు కూడా అఖిలప్రియ అరేంజ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, మరిది చంద్రబోస్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. భార్గవ్ రామ్, చంద్రబోస్ స్నేహితులే కిడ్నాప్‌కు ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌లోనూ వారిని గుర్తించామని పోలీసులు చెప్పారు. కిడ్నాప్ చేసిన వారిని ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లిన నిందితులు.. అక్కడ అఖిలప్రియ, భార్గవ్ రామ్‌తో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారా లేక అరెస్ట్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు భార్గవ్‌రామ్‌ను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. లోధా డెవలపర్స్ అపార్ట్‌మెంట్స్‌లో అఖిలప్రియతో పాటు భార్గవ్‌రామ్ కూడా ఉన్నారని, పోలీస్ స్టేషన్‌కు అఖిలప్రియ వెళ్లిన కారులోనే భార్గవ్‌రామ్ కూడా వెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది.