Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా వెనుక పెద్ద కుట్ర : బండి సంజయ్
Bandi Sanjay: మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనను బీజేపీ వదిలిపెట్టేలా లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు.;
Bandi Sanjay: మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనను బీజేపీ వదిలిపెట్టేలా లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. నిజానిజాలేంటో ప్రజలకు తెలియాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఈ ఎపిసోడ్‌పై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీజేపీ.
అటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గాని, సీబీఐ విచారణకు గాని సిద్ధమా అంటూ డైరెక్టుగా సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరింది. సీఎం కేసీఆర్ ప్రమాణం చేసేందుకు యాదగిరి గుట్టకు రాకపోతే.. ఫామ్‌హౌస్ ఎపిసోడ్ కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరిగిందని ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉంది బీజేపీ.
ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా జరిగిందని.. బీజేపీని బద్నాం చేసేందుకు యత్నించిన పోలీస్ కమిషనర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు.
ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు ఇంత డ్రామా ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేసినవాళ్లు టీఆర్ఎస్ నేతల వ్యాపార భాగస్వాములని బండి సంజయ్ తెలిపారు. ఫామ్‌హౌస్‌లో కనిపించిన వ్యక్తులకు కేసీఆర్ కుటుంబంతోనూ వ్యాపార సంబంధాలున్నయని, ఈ లెక్కన వాళ్లు కూడా టీఆర్ఎస్ వాళ్లేనని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారానికి వేదికైన దక్కన్ కిచెన్ సెంటర్ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని, ప్రగతి భవన్‌కు వారం రోజులుగా ఎవరెవరు వస్తున్నారు, ఢిల్లీలో సీఎంను కలిసిన వాళ్లెవరు, పోలీస్ కమిషనర్, నలుగురు ఎమ్మెల్యేలు, సూత్రధారులు, పాత్రధారుల కాల్ లిస్టుతోపాటు సీఎం క్యాంపు ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ లిస్ట్ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు బండి సంజయ్. అసలు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో దొరికిందని చెబుతున్న డబ్బులను పోలీసులు మీడియాకు ఎందుకు చూపలేదని బండి సంజయ్ నిలదీశారు.