తెలంగాణ బీజేపీ నేతలను ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హెచ్చరించారు. పార్టీపై తెలంగాణ ప్రజలు అపార నమ్మకాన్ని పెట్టుకున్నారని, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై పోరాడి న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవలి అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి మెరుగైన స్థానాలు రావడానికి ప్రజల్లో పార్టీపై పెరిగిన నమ్మకమే కారణమన్నారు. ఈ తరుణంలో బీజేపీ నేతలు అంతర్గత పోరులో బిజీ బిజీ అయిపోవడం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
నేతలు, కార్యకర్తలు ఒక్కతాటిపై పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు బీఎల్ సంతోశ్. అందరినీ కలుపుకుని పోయి పార్టీని బలోపేతం చేయా లని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలని, ప్రజలకు అండగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తు న్న పోరాటాలపై ఆరా తీశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు.
తెలంగాణకు ఆకస్మిక పర్యటనగా వచ్చిన బీఎల్ సంతోశ్.. వచ్చీ రాగానే నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలకనేతలతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. కీలక అంశాలపై చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట మరింత కష్టపడి పని చేయాలన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసికట్టుగా సమన్వయంతో కృషిచేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.