BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి నేడే ప్రకటన..!
ఆ ముగ్గురిలో బరిలో నిలిచేది ఎవరో..?
బీజేపీ తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపించనుంది. అధిష్టానం ఆమోదముద్ర వేసిన వెంటనే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు ఉప ఎన్నిక టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో కీర్తి రెడ్డికి టికెట్ దక్కే అవకాశముందని సమాచారం.పోరులో ఎవరు నిలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే...
ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని బీఆర్ఎస్.. ఈ సీటు గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నాయి. షెడ్యూల్ రావడంతో జూబ్లీహిల్స్ లో ప్రచారం జోరు మరింత పెరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. . లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.