Telangana Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు..?
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఉన్నవి రెండు సీట్లే అయినా... ఒక్కో రాజ్యసభ సీటుకు కనీసం 40 మంది ఎమ్మెల్యేల ఓటు అవసరం అవుతుంది. ప్రస్తుతం ఈ విషయంలోనే తెలంగాణ రాజకీయాల్లో నంబర్ గేమ్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం పరంగా చూస్తే ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం అవుతుంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయిన పది మంది బిఆర్ఎస్ వాళ్ళే అంటూ రీసెంట్ గానే స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇచ్చారు. కాబట్టి వాళ్లు క్రాస్ ఓటింగ్ వేస్తే వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వం మీదకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు బిఆర్ఎస్ పార్టీకి ఎలాగో రాజ్యసభకు కావాల్సిన సంఖ్యాబలం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్కు ఓటు వేసే అవకాశాలు కూడా లేవు. దీంతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశమే ఇప్పుడు మరోసారి తల మీదకు వచ్చింది.
మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఈ పదిమంది ప్రచారం చేశారు. కానీ వాళ్లు ఎక్స్ అఫీషియో ఓటును మాత్రం వినియోగించుకోలేదు. ప్రచారం చేయడం వేరు తమ అధికారిక ఓటు హక్కును వినియోగించుకోవడం వేరు. కాబట్టి ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ అధికారక ఓటు హక్కును కాంగ్రెస్ కు వేస్తే మాత్రం లీగల్ గా చిక్కులు తప్పవు. మరి కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ సీట్లను ఎమ్మెల్యేల కోటాలో దక్కించుకోవాలి అంటే ఏదో ఒక ప్లాన్ వేయాల్సిందే. లేదంటే మాత్రం ఒక రాజ్యసభ సీటు చేజారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నికలలో ప్రతిసారి వ్యూహాత్మకంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ విజయాలను దక్కించుకున్న సీఎం రేవంత్.. ఈ అంశం లో కూడా మద్దతును కూడగట్టే అవకాశాలు ఉన్నాయి.
అవసరం అనుకుంటే ఎంఐఎం మద్దతు తీసుకొని రాజ్యసభ సీట్లు దక్కించుకోగలదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరపున ఈ రాజ్యసభ పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ వర్గం భావిస్తోంది. కానీ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్లకు ఈ చాన్స్ ఇవ్వాలి అంటున్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సీనియర్లకు ఈసారి ఎలాగు మంత్రి పదవులు దక్కలేవు కాబట్టి కనీసం రాజ్యసభ పదవులు ఇచ్చి వారిని గౌరవించాలి అంటున్నారు. మరి సీఎం రేవంత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ ఉత్కంఠ గా మారింది.