BJP MLA: రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తుది శ్వాస వరకు హిందూత్వం కోసమే పోరాడుతా: రాజాసింగ్;
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. జూన్ 30న తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజాసింగ్. మరోవైపు, బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని గతంలోనే రాజాసింగ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
తుది శ్వాస వరకు హిందూత్వం కోసమే
హిందుత్వం కోసమే తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల భాజపాకు ఆయన చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 11 ఏళ్ల క్రితం భాజపాలో చేరాను. పార్టీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా రాజీనామాను నడ్డా ఆమోదించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాత్రీపగలు పనిచేస్తున్న లక్షలాది కార్యకర్తల బాధను నేను అధిష్ఠానానికి తెలియజేయలేకపోవచ్చు. ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లబ్ధి కోసమో రాజీనామా చేయలేదు. నేను హిందుత్వం కోసమే పుట్టాను.. చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తా’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.