తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ కొత్త స్ట్రాటజీ అమలుచేయనుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతల ఓటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. బీఆర్‌ఎస్ ముఖ్యనేతలపై బరిలోకి బలమైన నేతలు దింపాలన్న ఆలోచనలో ఉంది.ఎవరిపై ఎవరు పోటీ చేయాలన్న జాబితా సిద్ధం చేసింది.ప్లాన్ వర్కౌట్ చేసి బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే ఆలోచనలో కాషాయ నేతలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమైనట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.బీఆర్‌ఎస్ మంత్రులపైన కూడా బలమైన నేతల దించాలని,శాసనసభ ఎన్నికల్లో ఓడితే లోక్‌సభకు తిరిగి అవకాశం కల్పించే దిశగా బీజేపీ ఆలోచిస్తోంది.
ఇక బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను, కామారెడ్డిలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను పోటీ చేయించే ఆలోచనలో ఉంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్‌ను.. సిద్ధిపేటలో హరీష్‌రావుపై బూర నర్సయ్య ను పోటీలో నిలపాలని కమలనాధులు వ్యూహాలు రచిస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై గుజ్జల రామకృష్ణారెడ్డిని, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పై డీకే ఆరుణ, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డిని పోటీ దించనున్నట్లు సమాచారం. మంత్రులపై పోటీ చేసే 15 మంది అభ్యర్ధుల తొలి జాబితా ఈ వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది.