BJP's target Telangana: తెలంగాణలో బీజేపీ టార్గెట్ 90 ధైర్యమేంటి...

టార్గెట్ 90 నినాదం వెనక బీజేపీ విశ్వాసమేంటి.. ఉత్తరాది అనుభవాలు అమలు చేస్తుందా.. వలస నేతల పరిమితులు పసిగట్టిందా... యువత, మహిళల పై ఏం వ్యూహం పన్నుతోంది?

Update: 2023-01-12 12:37 GMT


2023 భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకం. ఈ సంవత్సరంలో 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరంలేదు. అందుకే బిజెపి దృష్టి ప్రధానంగా దక్షిణాది పైన ఉండబోతోంది. ఇప్పటివరకు కర్ణాటక మినహా దక్షిణాదిన బిజెపి బలంగా ఉన్న రాష్ట్రం ఏది లేదు. వారికి ఎంతో కొంత సానుకూలంగా కనిపిస్తున్న మరో రాష్ట్రం తెలంగాణ. 2014లో ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2018కి వచ్చేసరికి కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని నిలుపుకుని బలహీనంగా కనిపించింది. సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటివారే ఓటమిపాలయ్యారు. ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా పుంజుకుని నాలుగు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడంతో బిజెపికి తెలంగాణలో ఉన్న సానుకూలత సాదృశ్యమైంది. అప్పటినుంచి తెలంగాణపై మోదీ-అమిత్ షా ల ద్వయం ప్రత్యేక దృష్టి సారించడం మొదలైంది.

ఉత్తరాదిన విస్తరించిన విశ్వాసంతో...

కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి బిజెపి 2023 నాటికి అధికారాన్ని చేకించుకోగలమన్న విశ్వాసాన్ని చూపడం అతివిశ్వాసమనే భావించొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ అత్యల్ప ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో సైతం ఏకంగా అధికారాన్ని దక్కించుకున్న ఉదాహరణలున్నాయి. త్రిపుర లాంటి కమ్యూనిస్టుల కోటలో ఒక శాతం ఓటు నుంచి ఒకేసారి అధికారంలోకి రాగలిగింది. హర్యానాలో మూడు ఎమ్మెల్యేల స్థానం నుంచి అధికారం చేజిక్కించుకుని రెండోసారి ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఎస్పీ, బీఎస్పీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో రెండవసారి అధికారంలో కొనసాగుతోంది. అస్సాంలో రెండో సారి, ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్నిటినీ తమ జాబితాలో చేర్చుకోగలిగింది. ఇదంతా కేవలం మోదీ చరిష్మాతో వచ్చిన ఓటు బ్యాంక్ కాదు దీని వెనుక పక్క వ్యూహాలు సుదీర్ఘ కార్యాచరణలు అనేకం ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అందరూ భావిస్తున్నట్టు కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితమై రాజకీయం చేసే పార్టీ కాదు ఆ ఎన్నికల ఫలితాలు రాబట్టేందుకు అవసరమైన అన్ని రకాల అంశాలనూ ఏ ఒక్కటి విస్మరించకుండా అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. ఇది కేవలం నరేంద్ర మోడీ, అమిత్ షా లతో మాత్రమే సాధ్యం కాలేదు.. వారితోపాటు అనునిత్యం బిజెపి విజయాన్ని కోరుకునే ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు, ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ వంటి ఏజెన్సీలు అన్నిటికీ మించి పార్టీ భావజాలాన్ని తూ.చ తప్పకుండా నమ్మే కార్యకర్తల బలమూ కీలక భూమిక పోషించాయి.

దీర్ఘకాలిక వ్యూహం, పక్కా కార్యాచరణలో అద్వితీయం.

ఎన్నికల్లో గెలవడం అంటే కేవలం ఆరు నెలల ప్రచారం అన్న భావన నుంచి బిజెపి ఎప్పుడో బయటపడింది. ఎన్నికల రోజున తమవైపు ఓటు పడాలంటే ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని పరిగణంలోకి తీసుకుంటుంది. మెజారిటీ హిందూ ఓటు బ్యాంకు మొదలుకొని అందులోని చిన్న చిన్న వర్గాలు, కులాలు, ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు అన్నింటిని ఎన్నికల రోజునాటికి తమకు అనుకూలంగా మార్చుకోగలదు. అందుకు దేనికదే విడివిడి ప్రణాళికలూ, కార్యక్రమాలూ, కార్య నిర్వాహకులను రంగంలోకి దింపుతుంది.

తెలంగాణ పై ఏంటా విశ్వాసం.

అయితే ఇదంతా ఉత్తరాదిన కుదిరింది సరే దక్షిణాదిన అది అసాధ్యం అనుకునేవారూ ఉన్నారు. కేరళలో బలపడేందుకు చేసిన ప్రయత్నం ఏమాత్రం ప్రభావం చూపు లేదు, తమిళనాడులో ఇప్పుడే ఆ లక్షం నెరవేరేలా కనిపించడం లేదు మరి తెలంగాణలో ఎలా సాధ్యం అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ బిజెపి తెలంగాణలో పరిస్థితులు తమకు చాలా అనుకూలంగా ఉన్నాయని భావిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ కాలం నుంచీ సంఘ పరివార్ ప్రభావం హైదరాబాదు నగరంలో ఎక్కువే, చిరకాల సైద్దాంతిక వ్యతిరేకి ఐన ఎంఐఎం కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కుటుంబ పాలన పై ప్రజల్లో వ్యతిరేక భావన ఉంది. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెడుతూ బీఆరెస్ గా పార్టీ పేరు మార్చుకోవడం కూడా తెలంగాణ సెంటిమెంటు పలుచనపడినట్టేనని బీజేపీ భావిస్తోంది. అదే ఓటర్లను బీజేపీకి సానుకూలంగా మార్చుతుందని ఆశిస్తోంది.

బండితో మొదలై భాగ్యలక్ష్మీ ఆలయం, భైంసా, బాసరదాకా అన్నీ కలిసివచ్చే అంశాలే..

తెలంగాణ పట్ల బీజేపీ కార్యాచరణ బండి సంజయ్ రాష్ట్రాద్యక్షుడవడంతో ఊపందుకుంది. భాగ్యలక్ష్మి ఆలయం మీదుగా బైంసా, బాసర, అయ్యప్ప పై బైరి నరేష్ వ్యాఖ్యల వివాదాలు అన్నీ పార్టీ కార్యకర్తలను మరింత క్రియాశీలంగా మార్చాయంటారు పరిశీలకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీన పడుతున్న కొద్ది ఆ స్థానాన్ని బిజెపి ఎప్పటికప్పుడు ఆక్రమిస్తూ వస్తోంది. 2023 నాటికి కేసీఆర్ పై ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ వైపునకు కాకుండా బిజెపికి మళ్ళేలా ముందు నుంచి జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ ల్లో ఏ పార్టీ నుంచి ఏనేత అసంతృప్తితో వున్నా వెంటనే అక్కున చేర్చుకుంటోంది. ఆ క్రమంలో మున్నూరు కాపు ముదిరాజ్ వంటి బలమైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా , పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా లక్ష్మణ్ నూ, కార్యవర్గ సభ్యూడిగా ఈటల రాజేందర్ నూ నియమించడం అందుకు నిదర్శనం. డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి వంటి రెడ్డి సమాజిక వర్గ నేతలనూ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ని కట్టడి చేసేందుకు వ్యూహం పన్నుతోంది. ఆదివాసీ ఓటు బ్యాంకుపై కూడా దృష్టి సారిస్తోంది త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సోయం బాబురావును మంత్రిని చేసే అవకాశమూ లేకపోలేదంటున్నారు. ఎన్నికల నాటికి మరింత మంది రాజకీయ నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వెలుపల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో పార్టీ చురుగ్గా ఉంది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో సైతం కొత్త నాయకులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వలసనేతల పై బెంగాల్ పాఠం నేర్చుకుందా.

అయితే కేవలం వలసనేతలపై ఆధారపడితే ఎదురయ్యే పరిణామాలు వెస్ట్ బెంగాల్ ఎన్నికల నుంచి ఓ అనుభవంగా తీసుకుంది. ఎన్నికలముందు టీఎంసీనుంచి అనేకమంది బీజేపీలో చేరినా కార్యకర్తల బలం లేకపోవడంతో ఫలితాలు ఆశించినస్దాయిలో లేవనీ, తర్వాత నాయకులూ తిరుగుముఖం పట్టిన అనుభవాలను సీరియస్ గా తీసుకుంది. అందుకే తెలంగాణలో పార్టీ సిద్ధాంతాన్నీ, పార్టీకి సానుకూల ఓటు బ్యాంకును పెంచుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను అమలుపరుస్తూ వస్తోంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వ పధకాలు, బీజేపీ సిద్ధాంతాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకే పార్టీ విస్తారకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సైతాంతిక అంశాల పైన శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావడం దాని ప్రాధాన్యతను తెలుపుతుంది. కార్యకర్తల బలం పెంచుకోవడం బలమైన నేతలను తయారు చేసుకోవడం పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఉనికిని ప్రచారంలో ఉంచడం బిజెపి కార్యాచరణ. ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహాల్లో అమిత్ షాకు కుడి భుజంగా వున్న సునీల్ బన్సల్ ను తెలంగాణ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించడం మరో కీలక నిర్ణయం. ప్రతి నియోజకవర్గంలో బిజెపి ప్రత్యేక ఇన్చార్జులనూ, వారిపై పర్యవేక్షకులను నియమించడం ద్వారా ఏ నాయకుడు కూడా కార్యాచరణ అమలులో అలసత్వం ప్రదర్శించకుండా పక్కా ప్లాన్స్ వేస్తోంది. వచ్చే ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల గ్రామాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలనీ, వాటి కోసం ఇన్చార్జీలను సైతం నియమించింది. విస్తారకులు ప్రతి నియోజకవర్గంలో 20 రోజులపాటు ఉండాలనీ, వారిని పర్యవేక్షించే ప్రబారీలు నెలలో కనీసం 10 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని వారిపై ఇన్చార్జిలుగా ఉండే పాలక్ లు కనీసం మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటించాలని నిర్దేశించింది. గ్రామ గ్రామాన యువత మహిళలకు చేరువయ్యేందుకు సహకార సంఘాలను కలుసుకోవడం, క్రీడా పోటీలు నిర్వహించడం, సంక్రాంతి ముగ్గుల పోటీలు వంటివి నిర్వహించడం ద్వారా జన బహుళ్యంలోకి వెళ్లేలా సూచించింది. ఇదికాక చిన్న పార్టీల పొత్తులు, సినిమా ప్రముఖుల మద్దతులూ వంటివి సాధించడంలో బీజేపీకి కష్టమేమీ కాదు.

ఏప్రిల్ నుంచే బీజేపీ ఎన్నికల గేర్.. మోడీయే ప్రచారాస్ధ్రం.

హైదరాబాద్ పై తమ దృష్టి ఉందన్న ప్రకటన గత సంవత్సరం జూలైలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం ద్వారానే ప్రకటించింది. 2022లో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు సార్లు పర్యటించారు 2023 ఎన్నికల కల్లా ప్రధాని పర్యటనలు మరింత పెరుగుతాయని బిజెపి నేతలు అంటున్నారు. అప్పటిలోగా పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా పార్టీకి ఓటర్లలో కనీస గుర్తింపు దక్కుతుందని ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిని ఢీకొట్టే బలాన్ని పుంజుకోవచ్చని భావిస్తోంది. ఏడాది చివర్లో జరిగే ఎన్నికలకు ఆరునెలల ముందే అంటే ఏప్రీల్ నుంచే ఎలక్షనీరింగ్ ప్రరంభిచే వ్యూహంతో వుందట. టార్గెట్ 90 అన్న లక్ష్యాన్ని ఇప్పటికే నేతలందరికీ ఇచ్చిన నేపథ్యంలో పార్టీలో సీనియర్లు, కొత్త నేతలు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృశ్య సారించాలని ఆ జాబితాను కూడా సిద్ధం చేసింది.

బెంగాల్ రిపీటైనా ఇద్దరూ విజేతలే...

పశ్చిమ బెంగాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ దాదాపు ఇంతే హడావుడిగా కనిపించినా స్ధానికంగా బలంగా వున్న టీఎంసీ చేతిలో పరాజయం చవిచూసింది. అక్కడా ఇక్కడా వలస నేతలూ , కేంద్ర వర్సెస్ రాష్ట్రం వివాదాలూ, రాష్ట్రానికేమిచ్చావని మమతా బెనర్జీ నిలదీతలూ, అంతా అవినీతే అన్న బీజేపీ ఆరోపణలూ అన్నీ సేం టూ సేం. కానీ ముఖ్యమంత్రి గా బలమైన అభ్యర్ది ఎవరన్న అంశాన్ని ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. కేసీఆర్ రూపంలో బలమైన ప్రాంతీయ నేత సీఎం రేసులో వుంటే బీజేపీ లక్ష్యం చేరుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేల ఇక్కాడా అదే ఫలితం రిపీట్ ఐతే అయినా బీజేపీకి లాభమే .. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే వారి నినాదంలో మరో రాష్ట్రం చేరిపోతుంది. బెంగాల్ లో లా తెలంగాణలోనూ కాంగ్రెస్ మరింత పతనమవ్వొచ్చు.

Pradeep kumar Bodapatla

Input Editor, TV5. 

Tags:    

Similar News