BRS: నేడు బీఆర్ఎస్ సమాంతర అసెంబ్లీ సమావేశం

హాజరుకానున్న కేటీఆర్, హరీశ్ రావు

Update: 2026-01-06 04:00 GMT

తెలంగాణ భవన్‌‌లో నేడు బీఆర్‌ఎస్ పార్టీ సమాంతర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి నిరసనగా బీఆర్‌ఎస్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ తరహాలోనే స్పీకర్‌ను నియమించుకుని ప్రజాసమస్యలపై చర్చలు జరపనున్నారు. ఈ మాక్ అసెంబ్లీలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేయడంలో జరుగుతున్న ఆలస్యం, రుణమాఫీ ప్రక్రియలో ఉన్న గందరగోళం, అర్హులైన వారందరికీ అందకపోవడం, రాష్ట్రంలోని ఇతర పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమాంతర అసెంబ్లీ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హారుకానున్నారు. అసెంబ్లీ తరహాలోనే స్పీకర్‌ను నియమించుకుని, ప్రశ్నలు-సమాధానాలు, చర్చల రూపంలో ఈ కార్యక్రమం సాగనుంది. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ప్రజలకు చాటిచెప్పడమే సమాంతర అసెంబ్లీ ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.

అసెంబ్లీ తరహాలోనే...

ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన అవకాశం కల్పించడం లేదని బీఆర్‌ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ పరిస్థితులకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్, ప్రజాస్వామ్య స్వరం నొక్కివేతకు గురవుతోందని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అసెంబ్లీ తరహాలోనే స్పీకర్‌ను నియమించుకుని, ప్రశ్నలు–సమాధానాలు, చర్చల రూపంలో ఈ మాక్ అసెంబ్లీ సాగనుంది. అధికారిక శాసనసభలో లేవనెత్తలేకపోతున్న ప్రజా సమస్యలను ఇక్కడ విస్తృతంగా చర్చించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన ఉద్దేశంగా బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ సమాంతర అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

పక్కా వ్యూహంతోనే...

రైతాంగ సమస్యలే ఈ మాక్ అసెంబ్లీ చర్చల కేంద్రబిందువుగా ఉండనున్నాయి. రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో జరుగుతున్న ఆలస్యం, రుణమాఫీ ప్రక్రియలో నెలకొన్న గందరగోళం, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందకపోవడం వంటి అంశాలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేయనున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాకపోవడమే కాకుండా, రైతులను అయోమయంలోకి నెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి ఉన్నప్పటికీ, ప్రతిపక్ష గొంతును నొక్కడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకుంటోందని బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరగడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలకు బీజం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాల సమస్యలను ఒకే వేదికపై చర్చించి, ప్రజల మద్దతు కూడగట్టడమే బీఆర్‌ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. సమాంతర అసెంబ్లీ సమావేశం అనంతరం ఈ చర్చల సారాంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News