TG: కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారా?
అధికారికంగా ప్రకటించని బీఆర్‌ఎస్... కొనసాగుతున్న ఉత్కంఠ;
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎన్నికల అనంతరం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేసీఆర్ కాలు జారి పడిపోవడంతో దవాఖానలో చేరారు. ఈ సమస్యతోనే కొన్ని నెలల పాటు బాధపడ్డారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షనేత అయిన కేసీఆర్ను విమర్శిస్తూ వస్తోంది. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదంటూ ఆరోపించింది.
ఎంపీ ఎన్నికల సమయంలో..
ఎంపీ ఎలక్షన్ల సమయంలో కేసీఆర్ ప్రచారానికి వచ్చారు. బస్సు యాత్ర చేశారు. ప్రజలను కలుసుకున్నారు. కానీ ఆ తరువాత బయటకు వచ్చిందే లేదు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నడని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రతి జిల్లాలో పర్యటిస్తారని, కార్నర్ మీటింగ్లు ఉంటాయంటున్నారు.
బీఆర్ఎస్ ఎలివేషన్లు..
కాస్త ఆలస్యం కావొచ్చు… లేటు గా అయినా లెటెస్టుగా వస్తారు కేసీఆర్ అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ వింగ్ ఎలివేషన్లు ఇస్తుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదు… కేటీఆర్-హరీష్ రావే పార్టీ బాధ్యతలు మొత్తం చూసుకుంటారు అన్న వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ అనుకూల మీడియా… ఇక కేసీఆర్ వచ్చేస్తున్నారు, షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది అంటూ ప్రచారం చేసినా నెరవేరలేదు. రైతు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, రైతుబంధు ఆగిపోయింది, కళ్యాణలక్ష్మి చెక్కులు రావటం లేదు, పాలన గాడి తప్పింది, అవినీతి పెరిగిందంటూ ఇలా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శించినా, కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. ఒక్కటంటే ఒక్క మాట మాట్లడలేదు.
మరోసారి అలాంటి ప్రచారమే షురూ
కేసీఆర్ స్వయంగా ప్రకటించబోతున్నారు.. .రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దగాను ప్రశ్నించటానికి జిల్లాలు తిరగబోతున్నారు, కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాటానికి సమరశంఖం పూరించనున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా వరకు ఓకే… గ్రౌండ్ లో బీఆర్ఎస్ పోరాటం జీరో. కేటీఆర్-హరీష్ రావు ఎంత విమర్శించినా అది హైదరాబాద్ లోనే. క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలపై స్పందించే నాయకులే కరువయ్యారు. అప్పడప్పుడు యువ నాయకులు మన్నె క్రిశాంక్, పాడి కౌశిక్రెడ్డి, సుమన్, ఆంజనేయులు గౌడ్ లాంటి వారు స్పందిస్తున్నారు తప్పా మిగతా వారు అంతత మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ రైతులను ఓదార్చుతూ, నీళ్లు పారని కాలువలను పరిశీలిస్తూ, రైతుబంధు రాక ఆగమైన రైతులకు భరోసా ఇస్తూ పర్యటిస్తారని… తద్వారా ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో పోరాటం మొదలుపెట్టినట్లే అంటోంది బీఆర్ఎస్. ఈ సారైనా కేసీఆర్ ప్రజల్లోకి వస్తారో… ప్రచారంగానే మిగిలిపోతుందో చూడాలి.