BRS: అభ్యర్ధుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు
ఇప్పటికే 18మంది అభ్యర్థులను అధినాయకత్వం ఆయా సభల్లో ప్రకటించింది.;
ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అభ్యర్ధుల జాబితాపై బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 18మంది అభ్యర్థులను అధినాయకత్వం ఆయా సభల్లో ప్రకటించింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే సర్వే చేయించిన గులాబీ అధినాయకత్వం ముందుగా గెలిచే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. 60మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 25స్థానాల్లో ఎక్కువ మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో టికెట్ కోసం ఐదారుగురు పోటీ పడుతున్నారు.
టికెట్ దక్కించుకునేందుకు వారి వారి స్థాయిలో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు సీనియర్ నేతల వారసులు ఈ సారి బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. సీనియర్లు కూడా తమకు బదులు వారసులకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో.. జాబితా వడపోత అధినాయకత్వానికి కష్టంగా మారింది. మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌లు మారే చోట చివరిగా అభ్యర్ధులను ప్రకటించనుంది.