BRS: సమన్వయకర్తలను నియమించిన బీఆర్‌ఎస్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలకపాత్రన్న కేటీఆర్.. ఆలోచించి ఓటేయాలని వినతి;
ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 20 మంది ఇన్‌ఛార్జీలను నియమించినట్టు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ప్రకటించారు. ప్రధానంగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన గులాబీపార్టీ వరంగల్ పశ్చిమలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సహా... ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీMLAని రంగంలోకి దించింది. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహా. మరో నలుగురిని ఇన్‌ఛార్జీలుగా నియమించింది. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 2021లో బీఆర్‌ఎస్ నుంచి పట్టభద్రుల ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ తరపున రాకేశ్‌రెడ్డి బరిలో దిగుతుండగా... కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు.
కేటీఆర్ ఆగ్రహం
శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలకపాత్ర అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించి ఓట్లు వేయాలని ఓటర్లను సూచించారు. శాసనమండలికి ఎవరిని పంపాలో విద్యావంతులంతా సరైన ఆలోచన చేయాలని కోరారు. రైతుల కళ్లలో మట్టి కొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని, ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. నాడు కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భరోసా సమయానికి అన్నదాతలకు అందేదన్న ఆయన, ఈరోజు రేవంత్ సర్కార్ వచ్చి రైతులను ఆగం చేసిందని మండిపడ్డారు.
బీజేపీ కూడా...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పాలనా వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో మేధావులంతా కలిసి భాజపా అభ్యర్థిని గెలిపించాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ..పాలన మాత్రం మారలేదని...అమలు కానీ హామీలతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు.