BRS: ఎన్నికల కార్యచరణకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం

కేసీఆర్‌ రోడ్‌ షో, బస్‌ యాత్రలకు ప్రణాళిక... ముమ్మరంగా ముఖ్యనేతల ప్రచారం

Update: 2024-03-26 01:30 GMT

లోక్‌సభ అభ్యర్థిత్వాలను పూర్తి చేసిన భారత రాష్ట్ర సమితి ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. మండల స్థాయి వరకు అభ్యర్థులు పాల్గొనేలా సమావేశాలు నిర్వహించనున్నారు. దశల వారీ సమావేశాల తర్వాత ముఖ్యనేతల ప్రచారంతో పాటు అధినేత KCR బస్‌ యాత్రలు, రోడ్‌ షోలు ఉండనున్నాయి. ఉగాది తర్వాత కార్యాచరణ ఉధృతం కానుంది. శాసనసభ ఎన్నికల ఓటమిని అధిగమించిన లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కసరత్తు చేస్తోంది. గతంలోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి గులాబీ పార్టీ దాదాపు 60 నియోజకవర్గాలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలోనూ విస్తృత స్థాయి భేటీలు పూర్తి చేసింది.


తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థిత్వాల ప్రకటన పూర్తి చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించిన అధినేత KCR అభ్యర్థులను ప్రకటించారు. ముగ్గురు సిట్టింగ్ MPలకు మళ్లీ అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్‌... MLA, MLC, మాజీ ప్రజాప్రతినిధులు, కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. అభ్యర్థిత్వాల ప్రకటనతో కొందరు ఇప్పటికే వారి నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు, ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దశల వారీగా ఎన్నికల కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ నాయకత్వం సిద్ధమైంది. ముందుగా లోక్‌సభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతల సమావేశాలు నిర్వహించనుంది.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ఈ సమావేశంలో పాల్గొంటారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల సమావేశాలు కూడా తెలంగాణ భవన్‌లోనే నిర్వహించనున్నారు. మిగిలిన నియోజకవర్గాల సమావేశాలు జిల్లాల్లో నిర్వహించి ముఖ్యనేతలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. శాసనసభ నియోజవర్గాల వారీగా కూడా ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తాజా మాజీలతో పాటు ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర పార్టీ తరపున కూడా కొందరు నేతలు సమావేశాలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాతి దశలో మండలాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థులతో పాటు మండలాల వారీగా బృందాలు సమావేశాలకు హాజరయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ముఖ్యనేతలు విస్తృత ప్రచారం చేయనున్నారు. KTR, హరీష్‌ రావుతో పాటు కొందరు నేతలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రచార ప్రణాళిక ఉంటుంది. భారాస అధినేత KCR కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బహిరంగ సభలు కాకుండా బస్‌ యాత్రలు నిర్వహించనున్నారు. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను చుడుతూ రోడ్ షోల ద్వారా KCR ప్రచారం సాగనుంది. ఉగాది తర్వాత ఎన్నికల కార్యాచరణ, ప్రచారాన్ని ఉధృతం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Tags:    

Similar News