Musi River Project : మూసీ చుట్టూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు..

Update: 2026-03-14 08:45 GMT

తెలంగాణలో మూసీ నది చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ నదిపై తాజ్ కృష్ణ హోటల్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీని వ్యతిరేకించే బీఆర్ ఎస్, బీజేపీ నేతలు మూసీ పక్కన 3 నెలలు ఉండాలని.. తాను బస ఏర్పాటు చేస్తానని సవాల్ విసిరారు. అప్పుడే ప్రజల సమస్యలు అర్థం అవుతాయన్నారు. ప్రాజెక్టు మొదటి దశకు రూ.6వేల కోట్లే అవుతాయని.. గాంధీ విగ్రహానికి తమ ప్రభుత్వం రూ.70 కోట్లే ఖర్చు పెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. కావాలంటే బీఆర్ ఎస్, బీజేపీ నేతలు సలహాలు ఇస్తే తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే ప్రాజెక్టుపై నేడు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

ఇలా మూసీ చుట్టూ బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ మాత్రం ఈ విషయంలో కాస్త స్తబ్దుగా వెయిట్ చేస్తోంది. తనకు ఛాన్స్ వస్తే రెచ్చిపోడానికి టైమ్ కోసం చూస్తోంది. జీహెచ్ ఎంసీ మున్నిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో భాగ్యనగరంలో మూసీ చుట్టూ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అంతకు ముందు హైడ్రా చుట్టూ పెద్ద ఎత్తున నడిచిన ఈ రాజకీయ పరంపర.. ఇప్పుడు మూసీ వద్దకు చేరింది.

కేటీఆర్ తర్వాత బీజేపీ కూడా మూసీ చుట్టూ తమ వాదనలు కొనసాగించాలని చూస్తోంది. ఈ సారి జీహెచ్ ఎంసీపై పాగా వేయాలని మూడు పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మూసీ చుట్టూ రాజకీయాలు వేడెక్కుతుండటంతో తెలంగాణలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. మూసీ నిర్వాసితుల తరఫున కొట్లాడుతామంటూ బీఆర్ ఎస్, బీజేపీ చెబుతున్నాయి. తాము నిర్వాసితులకు వందశాతం న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఇలా ఎవరి వాదనలు వారివే అన్నట్టు మూసీ రాజకీయం నడుస్తోంది.

Tags:    

Similar News