BRS: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
కష్టాలకు భయపడకూడదన్న కేసీఆర్... పల్లెలకు మంచి రోజులు వస్తాయి.. ప్రజలు అధైర్యపడొద్దని కేసీఆర్ సూచన
బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లను కేసీఆర్ తన ఫాం హౌస్‌కు ఆహ్వానించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ‘‘మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి. వాటికి వెరవకూడదు. మళ్లీ వచ్చేది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అందించిన స్ఫూర్తి.. స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలి’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. సాదరంగా ఆహ్వానించి, శాలువాలతో సత్కరించిన కేసీఆర్.. వారికి మిఠాయిలు పంచారు. వారి యోగ క్షేమాలు, గ్రామాల్లో మౌలిక వసతులు, పంటల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
తొలి విడతలో ఎన్నికల జరగనున్న 4,236 సర్పంచ్ స్థానాల్లో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని 26 స్థానాలు ఉన్నాయి. ఈ 26 మందిలో 25 మంది కాంగ్రెస్ మద్దతుదారులు కాగా ఒకరు టీడీపీకి చెందిన వారు.
సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘నూతన సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని పల్లె అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని.. ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు. పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో.. రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయి’’ అని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి సర్పంచి నారన్నగారి కవితా రామ్మోహన్‌రెడ్డి దంపతులు, ఆ గ్రామ ఉప సర్పంచి ఎడ్మ సబితా కరుణాకర్, నర్సన్నపేట గ్రామ సర్పంచి గిలక బాల నర్సయ్య సహా గ్రామాల ప్రముఖులు పాల్గొన్నారు.