BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... అన్ని పార్టీలకు రెఫరెండమే
అని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు జరగనుంది. తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే కీలక ఉప ఎన్నికగా ఈ బై పోల్‌ను అన్ని పార్టీలు పరిగణిస్తున్నాయి. సాంస్కృతిక, వ్యాపార, విద్యా, సినీ వర్గాల సమ్మేళనంగా నిలిచి, సామాజికంగా, ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన ఓటర్లు జూబ్లీహిల్స్ లో ఉన్నారు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఇక్కడ గెలవడం కేవలం ఓటు విజయంగా కాకుండా, ప్రజాభిప్రాయాన్ని కొలిచే సూచికగా భావిస్తోంది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అనివార్యంగా వచ్చిన ఈ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. ఈ సీటు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రభుత్వ ప్రజాదరణను నిలబెట్టుకునే పోరాటంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, హైదరాబాదు భవిష్యత్తు వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. మహిళా ఓటర్లు, మైనారిటీలు, ఉద్యోగ వర్గం, మధ్యతరగతి వర్గాలు కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన వర్గాలు. ప్రభుత్వ పథకాలు “ఇంటి దాకా చేరాయి” అనే సందేశంతో ప్రచారం సాగుతోంది.బీఆర్ఎస్ పక్షానికి ఈ ఉపఎన్నిక “పార్టీ పునరుజ్జీవన సమరం”గా నిలిచింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేడర్‌లో ఏర్పడిన నిస్పృహను తొలగించడానికి ఈ ఎన్నిక కీలకంగా మారనుంది.
బీజేపీకి ఇది నగర రాజకీయాల్లో తమ పునాదిని బలపరచుకునే పరీక్ష. “మార్పు ప్రారంభం జూబ్లీహిల్స్ నుంచే” అన్న నినాదంతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేంద్ర వంటి ప్రముఖులు ప్రచార బృందాన్ని బలపరిచారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి స్థానిక వ్యాపార వర్గాల్లో పరిచయం కలిగి ఉండటం పార్టీకి ప్రయోజనంగా మారవచ్చు. ఇప్పుడు అంతా ఓటర్ల చేతుల్లో ఉంది. ఎవరికి పట్టం కడతారో.. ఎవర్ని పాతాళానికి తొక్కేస్తారో అన్న ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పెంచుతోంది.
ఓటుకు రూ.2,500
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలు పోటీపడి పంపకాలు చేపట్టాయి. ఓ పార్టీ ఓటుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేయగా... మరో పార్టీ మొదట రూ.వెయ్యి చొప్పున ఇచ్చి... ప్రత్యర్థి పార్టీ రేటు పెంచడంతో మరో రూ.వెయ్యి ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ఓ పార్టీ వారు డివిజన్‌కు 5 వేల చొప్పున 35 వేల కుటుంబాలకు కుక్కర్లు అందించినట్లు తెలిసింది. ఇంకో పార్టీ వారు నగదుతో పాటు లక్ష మంది మహిళలకు ఒక్కోటి రూ.వెయ్యి విలువ చేసే పట్టుచీరలు పంపిణీ చేశారని సమాచారం.