కులగణన పూర్తిచేసిన తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టిపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై చర్చించనుంది. దీని కోసం ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికను ఆదివారం ప్రణాళిక శాఖ మంత్రివర్గ ఉపసంఘానికి అందించింది. సోమవారం ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య న్యాయ కమిషన్ తన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అందించనుంది. అనంతరం ఈ రెండు నివేదికలపై మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు మంత్రిమండలి సమావేశమై ఈ రెండింటిపై ఆమోదముద్ర వేయనుంది.