స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా ఇవాళ సోమవారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సుదీర్ఘంగా సాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుపై సచివాలయంలో ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాలను, ఎంపీలు వెలిబుచ్చిన అభిప్రాయా లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎంపీల భేటీ జరిగిన మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి పాటిల్, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేష్ యాదవ్తో విడి విడిగా సమావేశమై బనక చర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల వివరాలను కూడా ముఖ్య మంత్రి రేవంత్ మంత్రులకు చెప్పనున్నారు. బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని ఢిల్లీ పర్యటనలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రకటించిన సీఎం రేవంత్ ఈ అంశంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపు ఈ భేటీని హైదరాబాద్ లో నిర్వహించి చంద్రబాబును ఆహ్వానించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడి చంద్రబాబుతో నిర్వహించే సమావేశ తేదీలను ఖరారు చేయాలని తెలంగాణ సీఎస్ రామకృష్ణారావును కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. పది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ భేటీలోనే కాళే శ్వరం, ఇతర ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైనా మంత్రిమండలి సమావేశం పొద్దుపోయేదాకా సాగడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.