ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పిస్తామని సీఎం ఉద్యోగ సంఘ నేతలకు వివరించారు.;
29 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వేతన సవరణ కమిషన్ సిఫారసుతో సంబంధం లేకుండానే ఫిట్‌మెంట్ ఉండనుందని సంకేతాలు ఇచ్చారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ అమలు కోసం కమిషన్ సిఫారసు చేయగా.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో ఆరుగంటలకుపైగా సుదీర్ఘంగా వారితో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నిరాశను నింపిందని, ఏపీలో మధ్యంతర భృతి 27 శాతం ఇస్తున్నారని, దానికన్నా ఎక్కువే ఫిట్‌మెంట్ ఉండాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరాయి.
ఉద్యోగ సంఘాల ప్రతిపాదనను సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. ఏపీలో ఇస్తున్న మధ్యంతర భృతి కంటే రెండు శాతం ఎక్కువే ఇస్తానని.. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇప్పుడు ప్రకటించలేదని, కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. అంశాల వారీగా సీఎం కేసీఆర్ తో జరిగిన చర్చల సారాంశాన్ని సంఘాలు వెల్లడించాయి. అలాగే 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు.
మరోవైపు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పిస్తామని సీఎం ఉద్యోగ సంఘ నేతలకు వివరించారు. ఏపీలో 1,218 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని.. త్వరలోనే వారిని తెలంగాణకు రప్పించేలా ఉత్తర్వులు వెలువడతాయన్నారు.