ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజాగాయకుడు గద్దర్.. తన పాటలతో పల్లెపల్లెనా తెలంగాణ భావజాలం వ్యాప్తి చేశారన్నారు. ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యం రగిలించారని కొనియాడారు. ప్రజ ల హృదయాల్లో గద్దర్ ప్రజా యుద్ధనౌకగా నిలిచారని.. ఆయన మరణంతో తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయిందన్నారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్ భౌతికకాయానికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ తన గళంతో కోట్ల ప్రజల్ని ఉత్తేజపరిచారని వివరించారు.
గద్దర్ పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం పవన్.. గద్దర్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఇటీవల తనను తమ్ముడా.. అంటూ ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, జాతీయ, అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుకున్నట్లు తెలిపారు. గద్దర్ మృతికి ఆచార్య హరగోపాల్ సంతాపం తెలిపారు. చివరి క్షణం వరకు బడుగు బలహీనవర్గాలు, పీడిత ప్రజల కోసం పోరాడిన వ్యక్తి గద్దర్ అని హరగోపాల్ కొనియాడారు.
గద్దర్ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. నిజామాబాద్, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. నిరుపేదగా పుట్టిన గద్దర్ ప్రజల మనిషిగా ఎదిగి.. అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజా యుద్ధనౌకగా పేరొంది.. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం కూడా జరిగింది