REVANTH: అభివృద్ధికి ఆ "బ్యాడ్ బ్రదర్స్" అడ్డు
హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు.. ఇండస్ట్రీని ఎలా వాడుకున్నారో తెలుసు..ముఖ్యమంత్రి రేవంత్ సంచలన ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇక నుంచి గంజాయి, డ్రగ్స్ అనే మాటే వినపడకూడదని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌తో తెలంగాణలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలని చెప్పారు. ఎవరైనా గంజాయితో రాష్ట్రంలో దొరికితే.. ఒక్కొక్కడిని తొక్కి నార తీస్తామని రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఈగల్ టీమ్ వ్యవస్థను తీసుకొచ్చి గంజాయి, డ్రగ్స్‌ను అరికడుతున్నాం.. హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి చెరువులు ఆక్రమణలు గురి కాకుండా కాపాడుతున్నామని అని అన్నారు. మంత్రులు పొన్నం అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాడ్ బ్రదర్స్.. కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి మెట్రో విస్తరణ అపుతున్నారని ఆయన ఆరోపించారు. పీజేఆర్.. శశిధర్ రెడ్డి లు హైదరాబాద్ బ్రదర్స్.. హైదరాబాద్ బ్రదర్స్ అభివృద్ధి చేశారు.. బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ నగరానికి తెచ్చిన గొప్ప వరం.. గంజాయి, డ్రగ్స్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఓ విషపురుగు.. నగరానికి గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చేందే కేటీఆర్ అన్నారు. నగరంలో అత్యాచారాలకు గంజాయి, డ్రగ్సే కారణమని చెప్పారు.
అభివృద్ధి చేసింది మేమే..
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మేమే.. చేసేది మేమే.. అందుకే తమకు ఓట్లు వేయండి అని అడుగుతున్నామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇండస్ట్రీని ఎలా వాడుకున్నారో.. హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో ఒక్కొక్కరి రాజకీయంగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు.. పార్టీలో కీలక నేతలను చాలా చాకచక్యంగా హరీష్ రావు బయటకు పంపించివేశారు.. చివరకు కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా విడదీస్తున్నారు.. ఆల్రెడీ ఒకరిని సక్సెస్‌ఫుల్‌గా బయటకు పంపారు కూడా అని అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని పదే పడే రౌడీ అని ప్రచారం చేస్తున్నారు.. దీపావళి రోజున డ్రగ్స్ వాడే వాడు రౌడీనా?.. నిత్యం ప్రజల్లో ఉండే వాడు రౌడీనో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. మైనార్టీ నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కూడా ఓర్వలేని వ్యక్తులు వీరు అని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కేటీఆర్ అనే వాడు.. విష పురుగు.. 44 చెరువులు బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించి అమ్మేశారు.. హైడ్రా మీద విషం చిమ్మేది మీరు కాదా..? బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాడు ఎవడు..? ఎడ్ల సుధాకర్… కేసీఆర్‌కి హెలికాప్టర్‌తో పూలు చల్లాడు అని బతుకమ్మ కుంట ఆక్రమించలేదా..?” అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌కి లీగల్ నోటీసులు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు హద్దులు దాటాయి. బీఆర్ఎస్ హయాంలో సినీ ఇండస్ట్రీని కేటీఆర్ ఎలా వాడుకున్నారో.. హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసంటూ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం విమర్శలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిచారు. సీఎంకు కూడా లీగల్ నోటీసులు పంపించే అవకాశం ఉంది. దీనిపై గతంలోనూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.