TS : ఇయ్యాల ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-04-11 05:02 GMT

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆయన కోరనున్నారు. గురువారం రంజాన్ సందర్భంగా ముందుగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు.

అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నట్టు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ ఇప్పటివరకు14 సీట్లకు అభ్యర్థు లను ప్రకటించింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల18 నుంచి ప్రారంభం కానుండగా.. మే 13వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్‌‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌‌ ఉల్‌‌ ఫితర్‌‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని, అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

రంజాన్‌‌ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ముస్లింల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రార్థించారు.

Tags:    

Similar News