స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో జరిగేమరో సదస్సులో పాల్గొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దావోస్ లో జరిగిన సదస్సుకు హాజరై 1.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలను తీసుకువచ్చిన సీఎం రేవంత్ వచ్చే నెల రెండవ వారంలో జపాన్ దేశం ఒసాకాలో జరిగే పారిశ్రామిక సదస్సులో (ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో) పాల్గొననున్నారు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ పర్యటనకు వెళుతున్నారని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం నేతృత్వంలోని బృందం జపాన్లోని పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను కలవనున్నట్టు సమాచారం. సీఎం రేవంతో పాటు జపాన్ కు ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారులు వెళ్లనున్నట్టు సమాచారం. పర్యాటక రంగ అభివృద్ధికి జపాన్ పర్యటనలో ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకునే అవ కాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టోక్యో తర్వాత ఒసాకా జపాన్లో రెండవ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతమని, వినోద రంగంలో ఈ నగరం ప్రపంచంలోనే ముందంజలో ఉందని చెబుతున్నారు. ఇక్కడే యూనివర్సల్ స్టూడియో, అక్వేరియంలు ప్రపంచ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు. జపాన్ ఆర్థిక రాజధాని ఒసాకాగా పేరొందింది.