REVANTH: ఓఆర్‌ఆర్‌ లీజు టెండర్లపై సిట్‌

శాసనసభలో వెల్లడించిన రేవంత్ రెడ్డి.. స్వాగతించిన హరీశ్ రావు;

Update: 2024-12-20 03:30 GMT

ఔటర్‌ రింగ్‌ రోడ్డును అప్పనంగా ఎవరికో అప్పగించారని, టెండర్లపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిట్‌తో సమగ్ర దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజుపై విచారణ జరపాలని హరీశ్‌రావు కోరటం అభినందనీయమన్నారు.


త్వరలోనే విధి విధానాలు..

ఓఆర్ఆర్‌ టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. విచారణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల డిమాండ్ లతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దేశం నుంచి పారిపోవాలనే బీఆర్ఎస్ నేతలు ఓఆర్ ఆర్ టెండర్లను అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కూడా స్వాగతిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం.. కృష్ణా-గోదావరి నదీ జలాలు, ఓఆర్‌ఆర్‌, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు, ఐటీ, ఫార్మా కంపెనీలు, శాంతిభద్రతలను కాపాడటం, మత సామరస్యాన్ని పెంపొందించామని తెలిపారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్సే. ఓఆర్‌ఆర్‌, శంషాబాద్‌ విమానాశ్రయం వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిందని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్‌ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్లే ఆదాయం పెరిగిందని రేవంత్ తెలిపారు. ఎన్నికల ముంగిట ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వటంపై తెలంగాణలో తీవ్ర చర్చ జరిగిందని... ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు టెండర్లపై విచారణ జరిపించేందుకు సిట్‌ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీలో అప్పులపై వాడివేడి చర్చ

తెలంగాణ శాసనసభలో అప్పులపై అధికార-ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఆర్బీఐ లెక్కలంటూ హరీశ్ రావు సభను పక్కదోవ పట్టిస్తున్నారని అధికార పక్షం మండిపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకే ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి అసెంబ్లీలో తప్పుడు లెక్కలు ఎలా చెప్తారని నిలదీశారు. ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియాలని అన్నారు.

Tags:    

Similar News