REVANTH: బీసీ కులగణన కోసం డెడికేషన్ కమిషన్

సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు... కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్న సీఎం;

Update: 2024-11-04 01:30 GMT

తెలంగాణ బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టీలోగా డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం స్పష్టం చేశారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్న సీఎం.. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఆరు నుంచి కులగణన ప్రారంభం కానుంది.


అఖిలపక్ష భేటీ

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6 నుంచి మొదలవనున్న ఈ సర్వే 30వ తేదీన ముగియనుంది. ఈ సర్వేలో దాదాపు 84 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు పాల్గొంటుండగా.. వీరందరికీ శిక్షణ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అయిన కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చనున్నారు. న్యాయనిపుణుల సలహా మేరకు కులగణనపై ఇప్పటికే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6న లేదా 7న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల ముఖ్యనేతలతో సమావేశమై.. కులగణనపై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకొనున్నట్టు సమాచారం.

కులగణనకు అత్యంత ప్రాధాన్యం

కులగణనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కులగణనపై అన్ని వర్గాల వారితో మాట్లాడేందుకు హైదరాబాద్‌కు వస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కులగణన సర్వేపై సదస్సులో రాహుల్‌గాంధీ మాట్లాడతారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ చేస్తామని భారత్‌ జోడోయాత్రలో రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఎన్నో దశాబ్దాల తర్వాత దేశంలోనే తొలిసారి ఈ సర్వేను తెలంగాణలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News