REVANTH: మూడు నెలల్లో 60 వేల పోస్టుల భర్తీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన... ఉద్యోగుల్లో భరోసా కల్పిస్తామని ప్రకటన;

Update: 2024-07-27 03:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్‌-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 31వేల ఉద్యోగాలను భర్తీ చేశామని... ఇప్పుడు 30 వేలతో కలిపి సంవత్సరం తిరిగే సరికల్లా 60 వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రతి ఉద్యోగాన్ని జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్, సివిల్‌ డిఫెన్స్‌ శిక్షణ సంస్థలో ఫైర్‌మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. 157 మంది డ్రైవర్‌ ఆపరేటర్లకు కొత్తగా నియామకపత్రాలు అందజేశారు. యువత ఏ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని రేవంత్‌ విమర్శించారు. అప్పట్లో నిరుద్యోగులు పాలకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణను సాధించుకోవడంలో కీలకపాత్ర పోషించారని.... కానీ గడిచిన పదేళ్లలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగలడం దురదృష్టకరమని రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగాలను భర్తీ చేయడం ఆరంభించిందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 31వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందించామని రేవంత్‌ గుర్తు చేశారు.

ఎవరైనా సరే జీతభత్యాల కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడరని కానీ ఫైర్‌మెన్లు మాత్రం విపత్తుల్లో అందరికంటే ముందుండి పోరాడతారని రేవంత్‌ అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో.. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నందుకు సీఎంగా మిమ్మల్ని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత గొప్పగా ఉండాలని... శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారని అన్నారు. మీ కుటుంబాలను బాగా చూసుకోండి. మీరంతా గ్రామాల నుంచి వచ్చినవారే. ఉద్యోగంలోకి రాగానే కొందరు తల్లిదండ్రులను, తోడబుట్టిన అక్కాచెల్లెళ్లను పట్టించుకోవడం లేదని అక్కడక్కడ ఫిర్యాదులొస్తున్నాయన్నారు. యువమిత్రులకు తానొక సూచన చేస్తున్నాని... మనతోపాటు మన గౌరవం పెరిగేలా బాధ్యతతో మెలగాలన్నారు.

Tags:    

Similar News