REVANTH: ఇప్పటి నోటిఫికేషన్లలోనూ ఎస్సీ వర్గీకరణ అమలు
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన... సహకరించాలని విజ్ఞప్తి;
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చామన రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు నాతో పాటు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరించారని అన్నారు. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిందని... అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారని రేవంత్ విమర్శించారు. డిసెంబర్ 3, 2023న ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్ జనరల్‌ను ఢిల్లీకి పంపించామని వెల్లడించారు. న్యాయకోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని రేవంత్ అన్నారు. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ తెలిపారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని... దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాని సీఎం కోరారు.
రేషన్ కార్డుల జారీకి మార్గం సుగుమం
తెలంగాణ మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ , దామోదర రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా.. జాబ్ క్యాలెండర్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.