ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్నటిదాకా పేరు ప్రముఖంగా వినిపించడం, వెంటనే బెదిరింపు, కబ్జా కేసు నమోదు కావడంపై స్పందించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Daykar rao). రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారాలపై ఎర్రబెల్లి నోరు తెరిచారు.
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి పరిచయం లేదని, అయన బంధువులు తమ ఊళ్లో ఉన్నారనే విషయం మాత్రం తెలిసిందని అన్నారు. ఆయన కుటుంబం ఏ పార్టీలో ఉందో విచారణ చేస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. ఆసలు ఆ కేసులోకి తననెందుకు లాగుతున్నారో తెలియట్లేదని ఎర్రబెల్లి దయార్ రావు అన్నారు.
పార్టీ మారాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి వస్తోందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇందంతా జరుగుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు దయాకర్ రావు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. అదేవిధంగా తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్న శరణ్ చౌదరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఇది కూడా పొలిటికల్ అజెండానే అని కొట్టిపారేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు. ఆయన అరెస్ట్ అయితే అసలు వాస్తవాలు బయట పడే అవకాశాలున్నాయి.