టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్భిణీకి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపో మహిళా కండక్టర్ జి. భారతికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సేవాతత్వం చాటుతుండటం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఎక్స్ వేదికగా ఈ సంఘటనపై స్పందించారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. గద్వాల- వనపర్తి రూట్ పల్లెవెలుగు బస్సులో సోమవారం ఉదయం నిండు గర్భిణి సంధ్య రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తి బయలుదేరింది. బస్సు వనపర్తి జిల్లా నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణీకి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి. భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్సు సాయంతో గర్భిణీకి పురుడు పోశారు. ఆ మహిళ పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అనంతరం 108 అంబులెన్స్ సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్స్ ను కూడా పనిలోపనిగా కౌంటర్ చేస్తున్నారు పరిశీలకులు.