నాగార్జునసాగర్ ఉపఎన్నిక బరిలో జానారెడ్డి !
అటు హాలియా సభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు.;
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? సీనియర్‌నేత జానారెడ్డి పోటీ చేస్తారా... లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. సాగర్ బరిలో తాను నిలుచుంటున్నట్టు జానారెడ్డి స్పష్టంచేసారు. తనను గెలిపించడం ద్వారా సాగర్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన వారవుతారని అన్నారు. తాను గెలిస్తే ప్రభుత్వానికి అవగాహన కల్పిస్తానని ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. నాగార్జున సాగర్‌కు జానారెడ్డి ఏమి చేయలేదని అనే హక్కు అర్హత ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు.
అటు హాలియా సభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కేసీఆర్ గుర్తించాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్‌ఎస్ ఏం చేసేదని జానారెడ్డి ప్రశ్నించారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో రుణమాఫీ ఊసే లేదని తెలిపారు. రుణమాఫీ లేక రైతులపై మరింత వడ్డీ భారం పడుతోందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని జానారెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడాన్ని అభినందించిన జానారెడ్డి... రుణమాఫీ హామీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.