ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండో హిత జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు రాష్ట్ర నాయకులు జనహిత పాదయాత్రలో పాల్గొన్నారు. జనహిత పాదయాద్రకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. నేడు శ్రమదానం, కార్యకర్తల సమావేశం నేపథ్యంలో కరీంనగర్ నుంచి భారీగా కార్యకర్తలను తరలించాలని నిర్ణయించారు. అయితే కలిసికట్టుగా కాకుండా నేతలు ఎవరికి వారే సమావేశాలు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి శ్రీధర్ బాబు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ప్రోత్సహిస్తుండగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్ రావును ఎంకరేజ్ చేస్తుండడం గ్రూప్ రాజకీయాలకు మరింత బలం చేకూరుతుంది. మరో నేత ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి సైతం వీరికి ధీటుగా జనసమీకరణలో నిమగ్నమయ్యారు. అయితే జనహిత పాదయాత్ర ద్వారా ప్రజల్లో సానుకూలత పెంచాలని పార్టీ భావిస్తుంటే నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నా రు. పాదయాత్ర అనంతరం మధురానగర్ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి గ్రా మానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.