Dharani: సిద్ధమవుతున్న ధరణి నివేదిక
ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సమగ్ర నివేదికకు ఆదేశం;
ధరణి పోర్టల్‌కి సంబంధించి రెవెన్యూశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాంకేతిక సమస్యలపై నిపుణులతో అధ్యయనం చేస్తోంది. పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు, నిర్వహణ సహా అన్నిఅంశాలను నివేదికలో సమగ్రంగా పొందుపర్చేలా రెవెన్యూశాఖ కసరత్తుచేస్తోంది. LOOK
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకి సంబంధించిన.. ధరణి పోర్టల్‌పై రెవెన్యూశాఖ సమగ్ర నివేదికను రూపొందిస్తోంది. 2020 నవంబర్2 నుంచి ప్రారంభమైన ఆ పోర్టల్ ద్వారానే రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ధరణి వెలుపల ఉన్న భూములకు హక్కులు లేవు. హక్కుల కల్పనకి 34 మ్యాడ్యూళ్లు ఏర్పాటుచేసినా సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణి పోర్టల్‌లోని లోపాలను పరిష్కరించి అందరీకీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గతనెల13న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణిపై అధికారులతో సమీక్షించారు. పోర్టల్‌లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందించాలని స్పష్టంచేశారు. ధరణి నిర్వహణ, సాంకేతిక అంశాలపై పలు అంశాలపై ప్రభుత్వం ఆరాతీసింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్లకు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది.వివాదాస్పద జాబితా (22A)లో నమోదైన భూములను జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించిన అంశంపైనా వివరాలు కోరడంతో ఆ దిశగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సీఎం ఆదేశాలతో పలువురు నిపుణులతో సాంకేతిక సమస్యలపై రెవెన్యూశాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. ధరణిలో దాదాపు 68 లక్షల వ్యవసాయ ఖాతాలుండగా ఆ పోర్టల్‌ని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. గత సెప్టెంబర్‌తో నిర్వహణ గడువు ముగియగా అదే సంస్థను కొనసాగిస్తూ వస్తున్నారు. ధరణి పేరు మార్పు నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించడం సులువుగా ప్రజలకు సేవలు చేరేందుకు ఉన్న మార్గాలను నిపుణులు నివేదికలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆరు గ్యారంటీల అమలు, ధరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టిసారించింది. ఈనెల 6 తర్వాత ధరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఆ తర్వాత ధరణి వ్యవహరంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.