CONGRESS: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ అవుట్..?
ఓఎస్డీ వివాదంలో కొండా సురేఖ మెడకు ఉచ్చు.. మంత్రి పదవి తొలగింపు ఖాయమంటూ ప్రచారం.. ఇప్పటికే మంత్రి ఇంటి వద్ద భద్రత తొలగింపు
కొండా సురేఖ మంత్రిపదవికి ఎసరు వచ్చింది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలతోపాటు కొండ సురేఖ కూడా సన్నిహితుల వద్ద ఇలాంటి కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మొదటి నుంచి ఆమె వివాదాల్లో ఇరుక్కోవడం తర్వాత ప్రభుత్వం వాటిని సమర్థించుకోవడం సాధారణంగా మారింది. ఇప్పటి వరకు ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్న మంత్రిగా కొండా సురేఖ పేరు పొందారు. కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీ ఇష్యూలపై మాట్లాడటం, తర్వాత ఓ ప్రైవేటు పార్టీలో మందు గురించి మాట్లాడటం, తోటి మంత్రులతో గిల్లికజ్జాలు, ఇలా వివిధ రకాలైన వివాదాల్లో ఇరుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన వివాదం మరింత రచ్చకెక్కింది. ఎకంగా ఓ కంపెనీ ప్రతినిధులను గన్‌తో బెదిరించిన వ్యక్తికి వంతపాడుతూ కాపాడే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
కఠిన చర్యలకు రేవంత్ సిద్ధం
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. మొదటి నుంచి వివాదాల మంత్రిగా ఉన్న కొండా సురేఖపై మొత్తం మంత్రిమండలే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసి తప్పించాలని చూస్తున్నారు. బుధవారం నుంచి ఓఎస్డీ చుట్టూ రాజుకున్న వివాదంలో ఆమె కుమార్తె చేసిన కామెంట్స్ మరింత కాక రేపాయి. ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సురేఖతో పార్టీ పెద్దలు మాట్లాడి ఆమెకు స్వతహాగా తప్పుకునేలా కూడా ఒప్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తనపై తన అనుచరులపై ఆరోపణలు వచ్చినందుకు అవి నిర్దారణ అయ్యే వరకు పదవికి దూరంగా ఉంటానని చెప్పే ఆస్కారం లేకపోలేదని, దీని వల్ల రెండు వర్గాలను కూల్ చేసినట్టు అవుతుందని కూడా పార్టీలోని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఇతర శాఖల్లో కూడా ఇలాంటి వారుంటే కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రభుత్వంపైనే తీవ్ర ఆరోపణలు
జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చామన్నారు. మఫ్టీలో ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులుగా భావించిన సురేఖ కుమార్తె సుస్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెక్కన్ సిమెంట్‌కు సంబంధించిన వ్యక్తులతో సమావేశమైన సుమంత్ గన్‌తో బెదిరించాడనే ఆరోపణలపై వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంట్లో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారని ఆయన వెనకున్న ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు వచ్చారంటూ సుస్మిత ఆరోపణలు చేశారు.
సీఎం అనుచరుడు రోహిణ్ రెడ్డి దందాలు చేస్తున్నారని, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలపై సుస్మిత బహిరంగ విమర్శలు చేశారు. వీటన్నింటిపై గుర్రుగా ముఖ్యమంత్రి ఇంకా కొండా సురేఖను కొనసాగిస్తే వాటికి సమ్మతించినట్టు అవుతుందని భావిస్తున్నారట. ఆమెను తప్పించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. మేడారం పనుల టెండర్లతో మొదలైన వివాదం మరింత పీక్స్ వెళ్లింది. అప్పటి నుంచి సీఎం మీటింగ్స్‌కు కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం వచ్చాక టీంగా పని చేయడం కష్టమని సీఎం సన్నిహతులు చెబుతున్నారు. కొండా సురేఖను తప్పించేందుకు అధిష్ఠానం ఓకే చెబుతుందా లేదా అన్నది మాత్రం అనుమానంగా ఉంది. అసలే బీసీల కోసం పోరాడుతున్న పార్టీగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఈ టైంలో ఓ బీసీ మహిళను తప్పిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది బేరీజు వేసుకుంటున్నారు. దీనికి కౌంటర్‌గా ఏం చేయాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసలే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల వేళ కొండా సురేఖపై తీసుకునే నిర్ణయం పార్టీకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు.