Congress: హుజురాబాద్‌లో ప్రచారం చేయకుండా కోమటిరెడ్డి దుబాయ్‌కు ఎందుకు వెళ్లారు..?

Congress: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మరాయి.

Update: 2021-11-17 10:17 GMT

Congress (tv5news.in)

Congress: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మరాయి. ఏ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనే టాక్ ఉంది. అందుకే సీనియర్లు, యువ నాయకులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు జాతీయ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకుంటారంటూ సెటైర్లు వేసేవారు లేకపోలేదు. గొడవలు, అసంత్రుప్తులు, అలకలు, బుజ్జగింపులు, రెబల్స్.. ఇలా చాలా వేరియేషన్స్ కాంగ్రెస్ లో కనిపిస్తాయంటారు.

ఎవరు పీసీసీ బాధ్యతలు తీసుకున్నా ఈ తలనొప్పులు తప్పవనేది పార్టీ శ్రేణుల మాట. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచినా.. కొందరు నేతల నుంచి హెడాక్ తప్పడం లేదట. ఎందుకంటే పీసీసీ పదవిని ఆశించి భంగపడిన నేతలు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు. పీసీసీ పదవి రానివారి సంగతి ఎలా ఉన్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం పార్టీలో కొరకరాని కొయ్యలా తయారయ్యారనే కామెంట్స్ బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

రేవంత్, టాగూర్ లని కోమటిరెడ్డి ఇరకాటంలోకి నెట్టే పనిలో పడ్డారా? పీసీసీ పదవిని టాగూర్ అమ్ముకున్నారంటూ కోమటిరెడ్డి ఆరోపణ పార్టీకి డ్యామేజ్ చేసేలా పీసీసీ వ్యవహరిస్తోందంటూ కోమటిరెడ్డి కామెంట్లు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. కోమటిరెడ్డి పావులు కదుపుతున్నారా అనే అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్ పై పీకల దాకా కోపంతో ఉన్న కోమటిరెడ్డి.. అటు పీసీసీ చీఫ్‌ని, ఇటు ఠాగూర్ ని ఇరకాటంలోకి నెట్టే పనిలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కొన్ని రోజుల నుంచి ఆయన టాగూర్, రేవంత్ రెడ్డిలే టార్గెట్ గా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుండడంతో పార్టీ శ్రేణుల అనుమానాలకు బలం చేకూరుతోంది. పీసీసీ పదవిని మానిక్కం టాగూర్ అమ్ముకున్నారంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ TRS చేతికి బ్రహ్మాస్త్రంగా మారింది. ఆ తర్వాత.. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కొత్త పీసీసీ టీమ్.. హుజురాబాద్ ఉప ఎన్నికని ఎదుర్కోవల్సి వచ్చింది.

కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయారు. దీంతో కోమటిరెడ్డి తన విమర్శలకు మరింత పదునుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ.. బైపోల్ లో కావాలనే అంతగా ప్రచారం చేయలేదనేది ఆయన ఆరోపణ. పార్టీకి డ్యామజ్ చేసేలా పీసీసీ కార్యవర్గం వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేస్తూ మరో వివాదానికే తెరలేపారు MP కోమటిరెడ్డి.

మేం గెలవలేం కాబట్టి ఈటలకు మద్దతివ్వాల్సి వచ్చిందన్న కోమటిరెడ్డి. తొలుత అగ్నికి ఆజ్యం పోసినా.. వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి. హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాల కంటే ముందు.. యాదాద్రి జిల్లాలో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు.. మేం గెలవలేం కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్ధి ఈటలకు మద్దతివ్వాల్సి వచ్చిందంటూ కోమటిరెడ్డి అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇది పార్టీలో పెద్దరచ్చకే దారితీసిందని చెప్పాలి. కోమటిరెడ్డిని అనుసరిస్తూ.. మరో సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం అగ్నికి ఆజ్యం పోశారనే టాక్ ఉంది. ఆ తర్వాత జగ్గారెడ్డి వెనక్కి తగ్గినప్పటికీ.. కోమటిరెడ్డి మాత్రం వార్ కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు. అధిష్ఠానం కోమటిరెడ్డి తీరును తప్పుబట్టి చివాట్లు పెట్టినట్లు ప్రచారం

మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాణిక్కం టాగూర్ పై సైతం ఓ కన్నేసి ఉంచారనే ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికకు ముందు ఐదు నెలల సమయం ఉన్నా.. కనీసం క్యాడర్ ఓట్లు కూడా వేయించుకోలేకపోయారంటూ రిజల్ట్ పై కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఓ వైపు బీజేపీకి మద్దతిచ్చామని ఆయనే అంటూ.. మళ్ళీ కనీసం పార్టీ ఓటు బ్యాంక్ ని కూడా కాపాడుకోలేదని పార్టీ నాయకత్వంపై కామెంట్ చేయడంపై టాగూర్ కొంత సీరియస్ గానే ఉన్నారట.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి రాకుండా దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ కి వెళ్లిన కోమటిరెడ్డి ఫొటోలు మీడియాలో వచ్చాయి. వీటిని టాగూర్ సైతం AICC అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా దుబాయ్ వెళ్లిన కోమటిరెడ్డి.. ఫలితాల తర్వాత కామెంట్స్ చేయడంపై పార్టీ సైతం కోమటిరెడ్డి తీరును తప్పుబట్టి గట్టిగానే చివాట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సైతం కోమటిరెడ్డిపై ఫైరయ్యారు. అసలు ఉప ఎన్నిక ప్రచారానికి రాని వాళ్ళకి.. ఇప్పుడు ప్రశ్నించే హక్కు లేదని కాస్త గట్టిగానే మండిపడ్డారు. దుబాయ్ కి వెళ్ళిన కోమటిరెడ్డి ఫొటోలు, బీజేపీకి మద్దతు ఇచ్చాం అని చేసిన కామెంట్స్ కి సంబందించిన వీడియోలు జాతీయ అధిష్టానానికి చేరవేసే పనిలో ఉన్నారట మానిక్కం టాగూర్. అదే జరిగితే.. అధిష్ఠానం కోమటిరెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, అప్పుడు కోమటిరెడ్డి దారెటు అనేది పార్టీలో హాట్ టాపిక్ అయింది. అటు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలోనూ కోమటిరెడ్డి రచ్చపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

Tags:    

Similar News