TS: ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ తుది కసరత్తు

ఇప్పటికే అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చిన హస్తం పార్టీ... త్వరలోనే ప్రకటించే అవకాశం

Update: 2024-03-04 05:00 GMT

తెలంగాణలో వీలైనంత త్వరగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సమీక్షించిన తర్వాత 14 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనున్నట్లు తెలుస్తోంది. విజయం సాధించేందుకు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. అంతేగాక... మిగిలిన మూడు స్థానాలైన హైదరాబాద్, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 9 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ రెండు లోక్‌సభ స్థానాలకు చూచాయగా అభ్యర్థులను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత వేగవంతం చేసింది.


రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటీ సమావేశమై నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. 17 లోక్‌సభ స్థానాలలో కనీసం 14 లోక్‌సభ స్థానాలైనా హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, పార్టీల వారీగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు సర్వే ద్వారా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే సైతం ఓటర్ల శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్లు వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, నాలుగు గ్యారెంటీల అమలు కలిసివస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కార్యాచరణ రూపొందించడం, రైతుబంధు అమలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖలపై లోతైన దర్యాప్తు, నీటి ప్రాజెక్టుల్లో అవినీతి బహిర్గతం, ప్రజాధనం దుర్వినియోగం జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి... లోతైన దర్యాప్తు జరిపించిన విషయమూ తెలిసిందే.


మరోవైపు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న దాదాపు రెండున్నర లక్షల ధరణి దరఖాస్తుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 9వ తేదీ వరకు ప్రత్యేక రెవెన్యూ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలలో సమస్యల పరిష్కారానికి సమయాన్ని సైతం నిర్దేశించింది. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో క్షేత్రస్థాయిలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అధిక సీట్లు గెలుచుకోగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఇటీవల సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఒక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 

Tags:    

Similar News