congress: కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి అవుట్..?
రేవంత్‌పై నేరుగా ఎమ్మెల్యే విమర్శలు.. తీవ్రంగా పరిగణిస్తున్న క్రమశిక్షణా కమిటీ.. తరచూ సీఎం లక్ష్యంగా తీవ్ర విమర్శలు;
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసే అవకాశం ఉంది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా పరిగణిస్తోంది. సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేయడం.. డీకే శివకుమార్‌తోనూ ప్రత్యేకంగా భేటీ కావడం వంటి విషయాలపై హస్తం పార్టీ ఆగ్రహంగా ఉంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి రాజగోపాల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తరచూ సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ బలహీనతలను బహిర్గతం చేస్తున్న కారణంగా ఆయనపై ముందు చర్య తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఆయనపై చర్యలు తీసుకోవటాన్ని రేవంత్ రెడ్డి సమర్ధిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీని మరింత బలహీనం చేసే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
కాంగ్రెస్‌లో కలకలం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం వ్యాఖ్యలను, ఆయన వైఖరిని తప్పుపడుతున్న రాజగోపాల్‌రెడ్డి.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, సూచనలు మాత్రమే చేస్తున్నానంటూనే తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఇటీవల బహిరంగంగానే ఖండించారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడల్లా రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తుండటం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాజగోపాల్ వ్యాఖ్యలు అప్పట్లోనే కాంగ్రెస్ శిబిరంలో చర్చకు తెరలేపాయి. వాటి వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ఎపిసోడ్ మరుగునపడుతోందనుకునే లోపే రాజగోపాల్ మరోమారు మరింత ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియా గురించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఆ తర్వాత బుధవారం కూడా అదే వైఖరి కొనసాగించారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలన్నిటిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.