Congress: పెరుగుతున్న ఇంధన ధరలు.. వినూత్న నిరసనలకు కాంగ్రెస్ ఏర్పాట్లు..
Congress: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ సమరశంఖం పూరించింది.;
Congress: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడం పట్ల కాంగ్రెస్ ఫైరయింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది.
దేశ వ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దశలవారీగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టనుంది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు ప్రజలంతా తమ ఇళ్ల బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్లు, వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచి పూల దండలు వేసి గంటలు, డ్రమ్స్, కంచాలు మోగించాలని కోరింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల అంశంలో కేంద్రం చెవుడు వదిలేలా మోత మోగాలని పిలుపునిచ్చింది.
ఏప్రిల్ 2 నుంచి 4 వరకు జిల్లా స్థాయిలో... ఏప్రిల్ 7న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్గేవాల్ వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా మోదీ సర్కార్ ప్రజల జేబుల్లోంచి లక్షల కోట్లు దోచుకుందని సూర్జేవాలా ఆరోపించారు. గత రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ ధర 29 రుపాయలు, డీజిల్ ధర 28రుపాయల 58పైసలు పెంచేశారని మండిపడ్డారు.
గత ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 531శాతం, పెట్రోల్‌పై 203శాతం పెంచిందన్నారు. దీంతో సామాన్యులు, గృహిణులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ప్రతిఒక్కరూ అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర ఇంఛార్జీలతో పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది.
ముఖ్యనేతలతో జరిగిన ఈ భేటీ మూడు గంటలపాటు వాడీవేడీగా సాగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ బదులు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై పలు సూచనలు, అభిప్రాయాలను ఇంఛార్జీలు... అధిష్టానానికి తెలిపారు. అలాగే దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు డ్రైవ్‌తో పాటు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో ఏఐసీసీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టిసారించిన హైకమాండ్.. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జిల మార్పునకు పచ్చాజెండా ఊపగా.. పూర్తి మార్పులను అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.