కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. వానాకాలం వచ్చేలోగా ఈ మూడు బ్యారేజీల పరిరక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించిన విషయం తెలిసిందే.
కాగా, మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాకుకు చెందిన ఒక గేటును నీటిపారుదల శాఖ అధికారులు శుక్రవారం పైకి ఎత్తారు. గత ఏడాది అక్టోబరు 21న 7వ బ్లాకులోని 20వ పిల్లర్ కుంగగా అప్పటి నుంచిబ్లాక్‌లోని గేట్లన్నీ మూసే ఉంచారు. బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులకు 85 గేట్లున్నాయి. మిగిలిన అన్ని బ్లాకుల గేట్లను అప్పట్లోనే ఎత్తి నీటిని ఖాళీ చేశారు. ఏడో బ్లాకులోని గేట్లను ముట్టుకోలేదు. తాజాగా వానాకాలంలో మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఇచ్చింది. దీంతో ఎస్‌ఈ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏడో బ్లాకులోని ఒక గేటును ఎత్తారు. ఇదే బ్లాక్‌లోని మిగతా గేట్లను సైతం వారం రోజుల్లో ఎత్తే అవకాశం ఉంది. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక మేటలు తొలగింపును ముమ్మరం చేశారు.