TG Deputy CM : సీఎం పదవి ఆశించింది నిజమే...డిప్యూటీ సీఎం భట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఇక అప్పట్లో సీఎం పదవి కోసం పోటీ పడ్డ నేతల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేమంటే మేము అంటూ కాంగ్రెస్ నేతల మధ్య చిన్నపాటి వార్ జరిగిందనే చెప్పొచ్చు. చివరిగా అధిష్టానం ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కరు. అయితే పదవులు ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం ఇప్పటికీ సమయం వచ్చినప్పుడల్లా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భట్టి... తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించింది నిజమేనని అన్నారు. సీఎల్పీ లీడర్ గా కష్టపడి పని చేశానని...అందుకే సీఎం పదవిని ఆశించినట్లు తన మనసులోని మాటను బయట పెట్టారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవితో తాను సంతోషంగానే ఉన్నానని చెప్పారు భట్టి. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార నేతల మధ్య సఖ్యత లేదని ప్రశ్నించగా.. తనకు పొంగులేటి, తుమ్మల, రేణుకా చౌదరిలతో ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక విషయంలో అసెంబ్లీ లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని... అవినీతికి పాల్పడింది ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు డిప్యూటీ సీఎం..