ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రం, మణగూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. మున్నేరును ఆనుకుని ఉన్న లోతట్టు కాలనీలతో పాటు, లకారం చెరువును ఆనుకొని ఉన్న కాలనీల్లోకి కూడా వరద నీరు చేరింది.
ఖమ్మం నగరంలోని కవిరాజ్ నాగర్, నయాబజార్, ప్రకాశ్ నగర్ చప్టా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరంలోని పలు కాలనీల నుంచి లకారం చెర్వులోకి వెళ్లే నాలాలను కబ్జా చేసి, నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరంతా కాలనీల్లోకి చేరింది. ఇందిరానగర్, కోర్డు పరిసర ప్రాంతాలతో పాటు కవిరాజ్ నగర్ ప్రధానంగా ముంపునకు గురయ్యాయి. ఆదివారం జిల్లా మొత్తం కలిపి సాయంత్రం 6 గంటల వరకు 269.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా బోనకల్ మండలంలో 43.8, చింతకానిలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితుల కోసం మొత్తం 39 పునరావాస సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు ఏడువేల మంది ఆశ్రయం పొందుతున్నారు.