MEDARAM: మేడారం మహా జాతర... రేపటి నుంచే మహా జాతర

భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2026-01-27 03:30 GMT

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క–సారలమ్మ జాతరకు మేడారం ప్రాంతం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతర సందర్భంగా రాజపేట మండల పరిధిలోని మూడు ప్రాంతాల్లో గద్దెల ప్రాంగణాలను వైభవంగా ముస్తాబు చేశారు. చిన్న మేడారం, యాదాద్రి మేడారం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో జాతర నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిన్న మేడారంలో 1994లో ప్రతిష్ఠించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈసారి 17వ జాతర జరగనుండగా, చల్లూరు గ్రామంలోని యాదాద్రి మేడారంలో రెండోసారి, లక్ష్మక్కపల్లిలో కూడా రెండోసారి జాతర నిర్వహిస్తున్నారు. మూడు చోట్ల అమ్మవార్ల గద్దెలను పుట్టమన్ను, పసుపు, కుంకుమ, పాలతో శుభ్రపరిచి మగ్గులు వేసి అలంకరించారు. సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గ్రామస్తులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

ఈ జాతర తల్లి బోనాలతో ప్రారంభం కానుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 28న సారలమ్మ, 29న సమ్మక్క గద్దెలపైకి చేరనుండగా, 30న భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు. 31న దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ పండుగకు యాదాద్రి జిల్లాతో పాటు హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, వైద్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో బెల్లం, బొమ్మలు, నాటు కోళ్లు, పూజా సామగ్రి, ఇతర వస్తువుల విక్రయానికి అనుమతి ఇచ్చారు. విద్యుత్ దీపాలతో దుకాణాలు, రోడ్లు అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ నెల 9న మండమెరుగుటతో మొదటి పూజలు ప్రారంభం కావడంతో అప్పటి నుంచే భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతిరోజూ గద్దెల వద్ద ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కోయ పూజారులు, గ్రామస్తుల ఊరేగింపులు, సంప్రదాయ పూజలతో జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తర జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పరిశీలించి భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహించేందుకు నిర్వాహకులు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టారు. భక్తులు రాత్రి వేళల్లో అక్కడే బస చేస్తూ చెట్ల కింద భోజనాలు చేసి ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు.పిల్లలు, పెద్దలు తేడా లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుంది. సంప్రదాయం, భక్తి, సంస్కృతి మేళవించిన సమ్మక్క–సారలమ్మ జాతరతో మేడారం ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోనుంది.

Tags:    

Similar News