తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వేతనాల పెంపు ప్రక్రియలో కదలిక
మొత్తం 50వేలమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.;
కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతనాల పెంపు ప్రక్రియలో కదలిక వచ్చింది. పీఆర్‌సీతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని కమిటీ చర్చలు మొదలు పెట్టింది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ బి.ఆర్.కే భవన్‌లో సమావేశమై ఈ మేరకు పీఆర్ సీ నివేదికతోపాటు, వేతన సవరణ, పదోన్నతులు, రిటైర్మెంట్ వయస్సుపొడిగింపుపై చర్చించారు.
ఉద్యోగ సంఘాలతోనూ సమావేశం కావాలని నిర్ణయించారు. వారితో చర్చించే అంశాలు, సమావేశాల షెడ్యూల్‌ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పదోన్నతులకు సంబంధించిన సర్వీసును కుదిస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దీనివల్ల మొత్తం 50వేలమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఫిట్ మెంట్, పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు 11వ పీఆర్సీ వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.