RAINS: భారీ వర్షాలతో జలమండలి అప్రమత్తం

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక... క్షేైత్ర స్థాయిలో పర్యటించాలని సిబ్బందికి జలమండలి ఎండీ ఆదేశం;

Update: 2024-08-20 04:00 GMT

హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తుండడంతో జలమండలి అప్రమత్తమైంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. పని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.


మ్యాన్‌హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313కి ఫోన్ చేయాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

నగరంలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో మోకాలిలోతు వరకు నీరు చేరింది. ముసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.

ముషీరాబాద్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాంనగర్‌, పార్సీగుట్ట, బౌద్ధ నగర్‌, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Tags:    

Similar News