Amit Shah Hyderabad : రజాకార్ల ప్రతినిధి అసదుద్దీన్.. పాతబస్తీలో అమిత్‌షా ఫైర్
మాధవీలతకు మద్దతుగా ప్రచారం;
రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలనికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో రోడ్‌షో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మాధవిలతను గెలిపించి మోదీ నాయకత్వానికి మద్దతివ్వాలని అమిత్‌షా కోరారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అమిత్‌షా... రాష్ట్రంలో 12 స్థానాలు గెలవడం ఖాయమని కష్టపడితే ఇంకా ఎక్కువే వస్తాయని అంచనా వేశారు.
సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో కేంద్రమంత్రి అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. తొలుత లాల్ దర్వాజ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం... లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సుధా సినిమా థియేటర్ వరకు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో చేపట్టారు. అమిత్‌షాకు కాషాయ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు.మజ్లిస్ నుంచి హైదరాబాద్‌కు విముక్తి కలిగించాలని అమిత్‌షా కోరారు. 400 సీట్లతో మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని... ఈసారి గెలిచే స్థానాల్లో భాగ్యనగరం కూడా ఉండాలని ఆకాంక్షించారు.
పాతబస్తీలో రోడ్‌షో తర్వాత నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన అమిత్‌షా ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. భాజపాకు 12 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని కష్టపడితే మరిన్ని సీట్లలో విజయం సాధించవచ్చని అమిత్‌షా అన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను వెళ్లి కలవాలని... మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఖండించాలని అమిత్‌షా తేల్చి చెప్పినట్లు సమాచారం. విబేధాలను పక్కన పెట్టి... నేతలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టంచేశారు.