మాజీ హోంమంత్రి నాయిని అంత్యక్రియలు పూర్తి

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి అంత్యక్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్రస్థానంలో జరిగాయి. ప్రభుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్యక్రియ‌లు నిర్వహించారు..

Update: 2020-10-22 12:01 GMT

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి అంత్యక్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్రస్థానంలో జరిగాయి. ప్రభుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్యక్రియ‌లు నిర్వహించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపి నివాళుల‌ర్పించారు. నాయినిని క‌డ‌సారి చూసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. నాయిని అంత్యక్రియ‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. 

ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌.. పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. కరోనా తరువాత అనారోగ్యం పాలైన నాయిని.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇతరు ప్రముఖులు నాయినికి సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నాయిని పాత్ర మరవలేనిదన్నది గుర్తు చేసుకున్నారు.. నాయిని మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు మంత్రులు.. . అయిదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మికనేతగా పనిచేశారని, 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్య సామాన్యమని గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News